అమరావతి : ఏపీలోని అన్నమయ్య(Annamaiah) జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై (MPDO Jawahar Babu) వైసీపీ నాయకుల దాడిని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ( Pawankalyan ) తీవ్రంగా స్పందించారు.
గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్‌రెడ్డి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని ఎంపీడీవోను శుక్రవారం కోరాడు. ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పడంతో ఒక్కసారిగా ఎంపీడీవోపై అనుచరులతో కలిసి దాడి చేసి గాయపరిచాడు.
గాయపడిన ఎంపీడీవోను పోలీసులు రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటనపై ఎంపీడీవో పోలీసులకు ( Police Case) ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా దాడి విషయాన్ని తెలుసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఎంపీడీవోపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. ఇటువంటి దౌర్జన్యాలకు , రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదన్నారు. బాధిత ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.