Free Bus Scheme | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి నిప్పులు చెరిగారు. చెల్లితో రాఖీ కట్టించుకోలేని వాడు ఇప్పుడు మహిళల గురించి నీతులు చెబుతున్నాడని లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. మీ మేనత్తలు ఏనాడైనా మీ నాన్న (చంద్రబాబు)కు రాఖీ కట్టారా అని నిలదీశారు. మీ ఇంటి శుభకార్యాల్లో మీ మేనత్తలను మీ నాన్న ఎప్పుడైనా పిలిచారా అని ప్రశ్నించారు. హెరిటేజ్‌లో మీ నాన్న మీ మేనత్తలకు ఎంత వాటా ఇచ్చారని నిలదీశారు. అసలు మహిళా గౌరవం గురించి మాట్లాడే అర్హత నారా లోకేశ్‌కు ఉందా అని నిప్పులు నెరిగారు. పవన్ కల్యాణ్ తల్లిని పది కోట్లు ఖర్చు చేసి మరీ లోకేశ్ తిట్టించలేదా అని ప్రశ్నించారు.
స్త్రీ శక్తి పథకం ప్రారంభించలేమని.. ఇదో ఉత్తుత్రి డ్రామా అని వైసీపీ నేతలు అనేవాళ్లని.. ఇప్పుడు వాళ్లు తమ తలలు ఎక్కడ పెట్టుకుంటారని లోకేశ్ చేసిన విమర్శలపైనా వరుదు కల్యాణి తీవ్రంగా మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళలను మోసం చేశారని విమర్శించారు. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకశ్ కలిసి మహిళలను మోసం చేశారని.. ఉచిత బస్సు పేరుతో మహిళల ఆశలను బస్సు టైర్ల కింద తొక్కేశారని ఆరోపించారు. ఏపీఎస్ఆర్టీసీలో 16 రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లో, అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి ఇచ్చారని తెలిపారు. ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని హామీ ఇచ్చారు కదా అని గుర్తుచేశారు. శ్రావణ శుక్రవారం రోజున మహిళలను చీటింగ్ చేశారని మండిపడ్డారు.
సీఎం అంటే చీటింగ్ మాస్టర్‌గా మార్చేశారని చంద్రబాబును వరదు కల్యాణి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 16 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలకు అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఉచిత బస్సు పథకం కింద పది, 15 బస్సులు మారితే గానీ తిరుపతి వెళ్లడం సాధ్యం కాదని తెలిపారు. లగేజీతో మహిళలు 15 బస్సులు మారి తిరుపతి వెళ్లగలరా అని ప్రశ్నించారు. తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం, విజయవాడకు ఉచిత బస్సు ప్రయాణం లేదని పేర్కొన్నారు. అంటే రెండున్నర కోట్ల మంది మహిళలను మోసం చేసినట్లే కదా అని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ప్రత్యేక విమానాల ఖర్చులను తగ్గించుకుంటే మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించవచ్చని స్పష్టం చేశారు.