Vanga Geetha | ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉన్నట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేత వంగా గీత మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిపై పదే పదే ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కాబట్టి దీనిపై ఏదైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సవాలు విసిరారు.
వంగా గీత శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. వైసీపీ శ్రేణులపై దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వైసీపీ పార్టీ ఆఫీసు భవనాలను కూల్చివేశారని అన్నారు. రాష్ట్రంలో నిర్మాణాలు తప్ప కూల్చివేతలు ఉండవని చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. ముందు చంద్రబాబును ఆయన మాటపై నిలబడాలని సూచించారు. ప్రజల సంక్షేమం చూడండి.. అంతేకానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేయకండని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలపై పదే పదే ఆరోపణలు చేయడం కూడా మంచి పద్ధతి కాదని వంగా గీత హితవు పలికారు. పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే మిథున్ రెడ్డి స్పందించారని గుర్తు చేశారు. గతంలో తానేమైనా తప్పులు చేశానని అనిపిస్తే.. వాటిపై నిరభ్యంతరంగా విచారణ చేసుకోవచ్చని మిథున్ రెడ్డి చెప్పిన విషయాన్ని తెలిపారు. ఇలా పదే పదే వ్యక్తులను ఇబ్బంది పెట్టడం కన్నా.. దానిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి.. విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు.