టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్కు 30 ఏండ్ల కిందట వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని చంద్రబాబు నాయుడు లాక్కున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత సాకె శైలజానాథ్ మండిపడ్డారు. రాజకీయాల్లోనే అత్యంత నికృష్టమైన ఈ ఘటనను టీడీపీ శ్రేణులు అందరికీ ఆదర్శంగా కొనియాడటం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు.
అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో శైలజానాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు సంపూర్ణ అధికారం చేపట్టి 30 ఏండ్లు అయ్యిందని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. 30 ఏండ్ల కిందదట సరిగ్గా ఇదే రోజు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి, తన కుటుంబసభ్యులతోనే ఆయనకు ద్రోహం చేయించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారని గుర్తుచేశారు. తీవ్ర మనస్తాపంతో ఎన్టీఆర్ ఈ లోకం నుంచి నిష్క్రమించేందుకు కారకుడు చంద్రబాబే అని అన్నారు. రాజకీయాల్లో మోసానికి, ద్రోహానికి, వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్గా అవతరించి 30 ఏళ్లు అవుతుందని విమర్శించారు. చంద్రబాబు తన మొత్తం పాలనా కాలం, రాజకీయ జీవితంలో అత్యంత అసమర్థ పాలకుడిగా గొప్ప గుర్తింపు సాధించుకున్నాడని ఎద్దేవా చేశారు. కనీసం తన నియోజకవర్గానికి కృష్ణా జలాలను అందించలేని విఫల నేత చంద్రబాబే అని దుయ్యబట్టారు.
రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని శైలజానాథ్ విమర్శించారు. ఎన్టీఆర్ ఆశయాల పట్ల నిజంగా టీడీపీ కార్యకర్తలకు నిబద్ధత ఉంటే.. తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసులు ఎవరో చెప్పాలని చంద్రబాబును నిలదీయాలని సూచించారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానిస్తుంటే.. చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు అంటేనే వంచన, దోపిడీ, మోసం గుర్తుకొస్తాయని తెలిపారు. ఎన్టీఆర్ పేరునే టీడీపీ కార్యకర్తలు మరిచిపోయేలా వ్యవహరించిన దారుణమైన నైజం చంద్రబాబుది అని విమర్శించారు. ఆనాడు ఎన్టీఆర్ ఎలాగైతే ప్రజల కోసం ఆలోచించారో.. అలాగే ఇప్పుడు అదే ఆలోచనా విధానాన్ని కలిగి ఉన్నది జగన్ మాత్రమే అని అన్నారు.