Sajjala Ramakrishna Reddy | ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఆయన ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఆ నెయ్యిలో 99.5% ఎక్కువ శాతం మిల్క్ ఫ్యాట్ ఉందని మీ రిపోర్టులే చెబుతుంటే అందులో యానిమల్ ఫాట్ ఉండే అవకాశం ఎక్కడుందని ఏపీ సీఎం చంద్రబాబును సజ్జల ప్రశ్నించారు. ఒకవేళ చంద్రబాబు చెప్పినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసి ఉంటే.. దాన్ని సప్లై చేసిన కంపెనీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఆ విషయం ఎందుకు లేదని నిలదీశారు. జూలై 6, 12వ తేదీల్లో పంపిన షోకాజ్ నోటీసుల్లో ఎక్కడా యానిమల్ ఫ్యాట్ ప్రస్తావనే లేదని స్పష్టం చేశారు. జంతువుల కొవ్వు కలిపిన ఆధారాలు ఉన్నందువల్లే సప్లయర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నామని ఆ నోటీసులో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.
చంద్రబాబు చేసిన తప్పుడు ఆరోపణ రుజువు కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దానికోసమే టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిల్ వేశారని చెప్పారు. నిజంగా జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందనే రుజువులు ఉంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయాల్సిందని అన్నారు. ఆధారాలు, ధైర్యం లేదు కాబట్టే చంద్రబాబు సిట్ విచారణ అని అంటున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు చెప్పడానికి ముందే తాను విచారణ మొదలుపెట్టానని చెప్పుకోవడానికే చంద్రబాబు సిట్ వేశారని విమర్శించారు.