Perni Nani | సినీ ఇండస్ట్రీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. సినిమా వాళ్లను బెదిరించడానికి మీరు ఎవరు? అసలు వాళ్ల సమస్య ఏంటో మీకు తెలుసా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని శనివారం నాడు మీడియాతో మాట్లాడారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తక్కువ ధరకే సినిమాలు చూడాలని అప్పటి జగన్ ఆకాంక్షించారని .. కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్ని నాని అన్నారు. జగన్ ప్రభుత్వంలో టికెట్ల ధరలు తగ్గిస్తే అప్పుడు పవన్ కల్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడరని అన్నారు. సినిమా మాది మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని గతంలో పవన్ కల్యాణ్ అన్న విషయాన్ని గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలో ఉంటే ఒక మాట.. ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
పవన్ కల్యాణ్ సినిమా ఫీల్డ్‌ను ఉద్ధరిస్తారని అనుకుంటే థియేటర్ యాజమాన్యాలపైనే విచారణకు ఆదేశించారని పేర్ని నాని మండిపడ్డారు. సినిమా వాళ్లను జైలులో వేస్తామని బెదిరిస్తున్నారని.. ఇవి దివాలాకోరు రాజకీయాలు కావా అని నిలదీశారు. మీ చెప్పుచేతల్లో ఉన్న మంత్రితో సినిమా వాళ్లను బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సినిమా వాళ్లను బెదిరించడానికి మీరు ఎవరు? అసలు వాళ్ల సమస్య ఏంటో మీకు తెలుసా అని ప్రశ్నించారు. రాబోయే ఫ్లాప్ సినిమా కోసం ఇంత హడావుడి అవసరమా అని మండిపడ్డారు.
సినిమా ఇండస్ట్రీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
‘ ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే.. సినిమా రంగంలో ఉన్న వారికి మాత్రం ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదికి దగ్గరికొచ్చినా.. ఒక్కసారైనా వచ్చి సీఎం చంద్రబాబును కలవలేదు. కేవలం తమ సినిమాల విడుదల సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా సినిమా రంగం అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా రాలేదని తెలిపారు. అందరూ కలిసిరావాలని ఎన్నిసార్లు పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించడం లేదు. అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకుందో అందరూ మరిచిపోయారు. నాటి ప్రభుత్వ వ్యక్తులను చూసి పనులు చేసేది. తమకు నచ్చని వారి సినిమాల విడుదల సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరిచిపోతే ఎలా?’ అని ఏపీ డిప్యూటీ సీఎం సినీ ప్రముఖులను ప్రశ్నించారు.
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, సుప్రియ, చినబాబు, అశ్వనీదత్ తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉంటే ఇండస్ట్రీని అభివృద్ధి చేయవచ్చని తెలిపానని తెలిపారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్కు అర్జీలు ఇస్తూ వచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉందని చెప్పారు. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్‌ను తగిన విధంగానే స్వీకరిస్తానని హెచ్చరించారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞప్తులకు, చర్చలకు తావులేదని స్పష్టం చేశారు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తా.. వాటితోనే సంబంధిత విభాగాలకు పంపిస్తానని చెప్పారు.