Kadambari Jethwani | తనతో పెళ్లికి నిరాకరించాననే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనను వేధింపులకు గురి చేశాడని ముంబై నటి కాదంబరి జెత్వానీ తెలిపారు. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా ఆధ్వర్యంలో అక్రమ కేసులు పెట్టి ముంబైలో సుమారు 15 మంది ఏపీ పోలీసు అధికారులు తనను కిడ్నాప్ చేశారని వెల్లడించారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో శుక్రవారం వాంగ్మూలం ఇచ్చిన అనంతరం కాదంబరి జెత్వానీ మీడియాతో మాట్లాడారు.
తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యాసాగర్ పెళ్లయిన 14 నెలలకే భార్యతో విడిపోయారని కాదంబరి జెత్వానీ అన్నారు. ఆయనకు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. విద్యాసాగర్ 2015లో తనతో పెళ్లి ప్రతిపాదన చేశాడని.. కానీ ఆయనకు ఉన్న వివాహేతర సంబంధాల కారణంగా ఒప్పుకలోదేని చెప్పారు. అప్పటి నుంచి తనపై చెప్పుకోలేని రీతిలో వేధింపులకు గురిచేశాడని అన్నారు. ముంబై నుంచి కిడ్నాప్ చేసి తనను విజయవాడకు తీసుకొచ్చారని తెలిపారు. దీనివల్ల ముంబైలో తనపై ఉన్న కేసులో అందుబాటులో ఉండలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై కేసుకు ఏపీలో నమోదు చేసిన తప్పుడు కేసుకు లింక్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఓ పవర్ఫుల్ వ్యక్తికి క్లీన్‌చీట్ ఇచ్చే ప్రయత్నం చేశారని అన్నారు. తనపై పెట్టిన కేసులో ధనం, అధికారం ఏకమయ్యాయని తెలిపారు.
ఈ కేసు కారణంగా సుమారు 45 రోజుల పాటు దుర్భర జీవితాన్ని గడిపానని అన్నారు. ఈ కేసులో రాజకీయ నాయకులకు సంబంధం ఉందో లేదో విచారణలో తేలాల్సి ఉందని చెప్పారు. అప్పటి సీపీ కాంతి రాణా ఆధ్వర్యంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని తెలిపారు. పోలీసుల వేధింపుల కారణంగా తన తల్లిదండ్రుల ఆరోగ్యం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో మా కుటుంబానికి వచ్చిన పదవీవిరమణ డబ్బులను కూడా వాడుకోలేకపోయమని తెలిపారు. కేవలం డబ్బుల కోసం మహిళపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా? అని కాదంబరి జెత్వానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కేసులో ఇరికించారని చెప్పే ఆధారాలు అన్నింటినీ పోలీసులకు అందజేశానని చెప్పారు. తనపై పెట్టిన కేసులో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించింది విద్యాసాగరే అని.. తన ఆధార్ కార్డును కూడా ఫోర్జరీ చేవారని తెలిపారు.