YS Jagan | ఏపీలో వైసీపీ ఘోర ఓటమిపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని.. కానీ ఇలాంటి ఓటమిని చూస్తామని అనుకోలేదని తెలిపారు. వైఎస్ జగన్ చుట్టూ పనికిమాలిన అధికారులు, చెత్త కోటరీ ఉందని విమర్శించారు.
ధనుంజయరెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్ దగ్గర ఉండటం వల్ల ఎమ్మెల్యేలమంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని జక్కంపూడి రాజా వెల్లడించారు. ఏదైనా అర్జీ తీసుకెళ్తే.. ఆయనే ముఖ్యమంత్రిలా ఫీలయ్యి.. తన రూమ్ దగ్గరే గంటల తరబడి కూర్చోబెట్టుకునేవాడని విమర్శించారు. కూర్చోబెట్టడం కాదు.. నిల్చోబెట్టేవాడని అన్నారు. గదిలోపలికి వెళ్తే ఎమ్మెల్యేలతో కనీసం రెండు నిమిషాలు కూడా మాట్లాడటానికి తీరిక లేనట్టు వ్యవహరించేవాడని ధనుంజయరెడ్డిపై నిప్పులు చెరిగారు. ధనుంజయరెడ్డిని జగన్ గుడ్డిగా నమ్మారని.. ఆ విశ్వాసంతోనే జగన్కు ఏది చెప్పినా ధనుంజయరెడ్డిని పిలిచి చెప్పేవాడని అన్నారు. ధనుంజయరెడ్డి చేతిలోకి ఏ కాగితం వెళ్లినా అంతే సంగతులు అన్నారు. కొత్తగా గెలవడంతో ఏదైనా చేద్దామనే తపనతో ఎమ్మెల్యేలు అధికారుల దగ్గరకు వెళ్తే సరైన స్పందన లభించేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రిని మించి ఏదైనా చేయాలని వైఎస్ జగన్ తపన పడేవారని జక్కంపూడి రాజా తెలిపారు. తాను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అని అడిగిన ఏకైక దమ్మున్న సీఎం జగన్ అని స్పష్టం చేశారు. జగన్ గెలిచినా.. ఓడినా రియల్ హీరో అని అభిప్రాయపడ్డారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ, పనికిమాలిన అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారని.. జగన్ను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.