Gudivada Amarnath | విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్షిస్ సమ్మిట్‌తో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. గతంలో 2014-19 మధ్యలో ఇలాగే మూడుసార్లు సీఐఐ సదస్సులు నిర్వహించి.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు నమ్మించారని గుర్తుచేశారు. కానీ అందులో రూ.35వేల కోట్లు మాత్రమే రూపాంతరం చెందాయని అన్నారు. అలా లక్షల ఉద్యోగాలు వస్తాయని యువతను నమ్మించి, లేనిపోని ఆశలు పెట్టి మోసం చేశారని విమర్శించారు.
వైసీసీ ప్రభుత్వంలో కూడా ఈ సదస్సులు నిర్వహించామని గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు. పారదర్శకంగా ఎంవోయూలు కుదుర్చుకోవాలని తమ అధినేత వైఎస్ జగన్ చెప్పేవారని తెలిపారు. ఈ సీఐఐ సదస్సులో కొత్తగా ఏం తీసుకొచ్చారో కూటమి నేతలు క్లారిటీ ఇవ్వలేకపోయారని అన్నారు. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకే.. ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ ఒప్పందాలు కుదర్చుకున్నారని తెలిపారు. పాత సినిమాకు చంద్రబాబు కొత్త పేరు పెట్టారని విమర్శించారు.
లులు చైర్మన్ చంద్రబాబు ఆస్థాన విద్వాంసుడు అని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఏ సదస్సు జరిగినా లులు అధినేత కనిపిస్తారని తెలిపారు. పారిశ్రామిక వేత్తలను బెదిరించి అబద్ధాలు చెప్పించారని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ గొప్పల కోసం వందల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే స్టీల్ ప్లాంట్‌ను ఏదొకటి చేసేలా ఉన్నారని అన్నారు.