MLC Election | విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. వైజాగ్ కలెక్టరేట్లో సోమవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీకి పూర్తి బలం ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు. 838 ఓట్లలో 500 పైచిలుకు తమకు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ పడుతుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. వైసీపీకి పూర్తి బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతోందని అన్నారు. వైసీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు నిలబెడుతున్నారని మండిపడ్డారు.
రాజకీయాలంటే వ్యాపారం కాదని బొత్స సత్యనారాయణ అన్నారు. మెజార్టీ ఉంది కాబట్టే తాము పోటీ చేస్తున్నామని ఆయన తెలిపారు. తమకు వివాదం అవసరం లేదని చెప్పారు. రాజకీయాల్లో విలువలు అవసరమని హితవుపలికారు. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పు లేదు కానీ మెజార్టీ మొత్తం తమకే ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబడెతుందని అనుకోవడం లేదన్నారు. ఒకవేళ టీడీపీ పోటీ పెడితే అది దుశ్చర్యే అవుతుందని మండిపడ్డారు.