Ambati Rambabu | పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని ఆరోపించారు. అన్యాయంగా వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని విజయవాడలోని ఎన్నికల కమిషన్కు ఆయన ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. మా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన అన్ని స్థానాల్లో కాకుండా పులివెందుల, ఒంటిమిట్టలో మాత్రమే జడ్పీటీసీ ఉప ఎన్నికలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. పులివెందులలో మమ్మల్ని ఓడించి, వైసీపీ పని అయిపోయిందని చెప్పాలని ప్లాన్ చేశారని అన్నారు.
ఓటరు స్లిప్పులను లాక్కొని.. వేరే గ్రామాల్లోని వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ దొంగ ఓట్లు వేయిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. నంద్యాలలో కూడా చంద్రబాబు గతంలో ఇలాగే చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు చర్యలతో వందేళ్లు వెనక్కిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదని అన్నారు. టీడీపీ, పోలీసులు, ఎన్నికల కమిషన్ కలిసిపోతే ఇక ఏం చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చేసే దుర్మార్గాలను అర్థం చేసుకుని ప్రజలు మీకు సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.