Ambati Rambabu | ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనాభా పెరగాల్సిన అవసరం చాలా ఉందని.. ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలను కనాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెబుతుండటంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం అని మోసం చేశావని విమర్శించారు. ఇప్పుడేమో లెక్క లేకుండా పిల్లల్ని కనమంటున్నావ్.. సిగ్గుందా అంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ప్రకటించారు. ఒకప్పుడు జనాభా అంటే భారమని.. ఇప్పుడు ఆస్తి అని వివరించారు. అప్పట్లో జనాభాను నియంత్రించేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని.. ఇప్పుడు జనాభా అవసరం ఉందని చెప్పారు. ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రమాణికంగా తీసుకుంటామని తెలిపారు.
ఎంత మంది ఉన్నా అందరికీ
“తల్లికి వందనం” అని మోసం చేసావు
ఇప్పుడేమో లెక్కలేకుండా పిల్లల్ని
కనమంటున్నావ్, సిగ్గుందా ?@ncbn @naralokesh— Ambati Rambabu (@AmbatiRambabu) January 17, 2025
జనాభానే ఆస్తి. సంపద సృష్టిస్తున్నామంటూ జనాభాను మరిచిపోతే.. ఆ సంపద ఎవరికి ఇవ్వాలో తెలియదని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో పెద్ద పెద్ద విమానాశ్రయాలు, విశాలమైన రహదారులు ఉంటాయి కానీ.. వాటిని వినియోగించుకునే మనుషులే ఉండరని వ్యాఖ్యానించారు. జనాభాను పెంచాలని చంద్రబాబు అనడం ఇదే మొదటి సారి కాదు.. తాజాగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. అయితే దీనిపైనే అంబటి రాంబాబు స్పందించారు. తల్లికి వందనం పేరుతో మోసం చేసి.. ఇప్పుడెలా లెక్కలేకుండా పిల్లల్ని కనాలని చెబుతున్నావని మండిపడ్డారు.
తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేల చొప్పున అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ పథకాన్ని అమలు చేయలేదు. అంతేకాకుండా ఈ పథకంలో కోత పెడుతూ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నప్పటికీ ఒక్కరికే ఈ పథకం వర్తింపజేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది.