విజయనగరం: రాష్ట్రంలో కాపు జాతిని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఆరోపించారు. కాపు నేస్తం అంటూనే కాపులకు అన్యాయం చేయడం కేవలం జగన్‌కే చెల్లిందన్నారు. కాపుల చేతుల్లో ఉన్న సినీ పరిశ్రమను సీఎం జగన్ సర్వ నాశనం చేశారని, కొంతమంది కాపు నేతలకు మాత్రమే పదవులు ఇచ్చి.. చాలా మందిని విస్మరించారని ఆయన దుయ్యబట్టారు. చీపురుపల్లిలోని టీడీపీ విజయనగరం పార్లమెంట్ శాఖ అధ్యక్షుడు కిమిడి నాగార్జున నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాపు సమాజం ఓట్లను పొంది గద్దెనెక్కిన వైఎస్ జగన్.. ఇదే కాపు జాతి నుంచి ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపలేదని కళా వెంకటరావు ఆరోపించారు. కాపు సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా తయారుచేసుకోవడం విచారకరమన్నారు. కాపు కులానికి చెందిన ఐదుగురిని రాజ్యసభకు పంపిన ఘనత టీడీపీదే అని గుర్తు చేశారు. కాపు నేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తున్నదని చెప్పారు. కాపు సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే డిమాండ్ ఉన్నదన్నారు. కాపులకు న్యాయం చేస్తున్నానని చెప్పే అర్హత జగన్‌కు లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో చీపురుపల్లి టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.
ఇలాఉండగా, కాపు నేస్తం సభలో సీఎం జగన్ మాట్లాడిన భాష అత్యంత హేయంగా, అవమానకరంగా ఉన్నదని జనసేన సీనియర్ నాయకుడు నాదేండ్ల మనోహర్ ఆరోపించారు. సమాజంలోని కులాలను కలపాల్సిన బాధ్యతను విస్మరించిన జగన్.. సమాజంలో అలజడి సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. కుటిల రాజకీయాల కోసం ఇంతగా దిగజారి మాట్లాడటం శోచనీయమన్నారు. పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ ఇష్టానుసారంగా మాట్లాడటం బాధకరం అని నాదెండ్ల మనోహర్ విచారం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన సంస్కారానికి నిదర్శనమని విమర్శించారు.