అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లాను ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. బుధవారం ఆయనను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించిన సీఎం జగన్.. ఈ మేరకు ఆయనకు బీఫాం అందజేశారు. ఎమ్మెల్సీ కరీమున్నీసా మృతితో ఖాళీ అవడంతో ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్నది. కరీమున్నీసా కుమారుడైన రుహుల్లానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ ఎంపికచేశారు.
మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పోస్టును అదే వర్గానికి చెందిన ఎండీ రుహుల్లాకు ఇవ్వాలని సీఎం జగన్ ఇదివరకే నిర్ణయించారు. ఈ మేరకు దివంగత ఎమ్మెల్సీ కరీమున్నీసా కుమారుడైన ఎండీ రుహుల్లానే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. తాడేపల్లిలోని తన కార్యాలయానికి పిలిపించుకున్న జగన్.. నామినేషన్ వేయడానికి పార్టీ బీఫాంను రుహుల్లాకు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, రుహుల్లా తండ్రి మహ్మద్ సలీమ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా కరీమున్నీసా కుమారుడు రుహుల్లాకు అవకాశం కల్పించడంపై పలువురు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రుహుల్లా మీడియాతో మాట్లాడుతూ.. తన తల్లి కరీమున్నీసా మూడు నెలల క్రితమే చనిపోవడంతో ఖాళీ అయిన స్థానాన్ని సీఎం వైఎస్ జగన్ తనకు కేటాయించారని, ఫోన్ చేసి పిలిచి మరీ బీఫాం ఇచ్చారని తెలిపారు. రేపు నామినేషన్ దాఖలు చేస్తానని, మైనార్టీలందరూ సీఎం జగన్కు రుణపడి ఉంటారన్నారు. తన తల్లి అడుగుజాడల్లో నడిచి, ఆమె చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తానని చెప్పారు.