Margani Bharat | తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ పలు సందేహాలు లేవనెత్తారు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో విభజన సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది తక్కువే అని అన్నారు. మిగిలిన విషయాలపైనే ఎక్కువగా చర్చలు జరిపారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్, డ్రగ్స్‌పైనే చంద్రబాబు, రేవంత్ చర్చలు జరిపారని మార్గాని భరత్ తెలిపారు. అసలు విభజన సమస్యల పరిష్కారం కోసం కలిశారా? వ్యక్తిగత అవసరాల కోసం కలిశారా అని అనుమానం వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రమేయం లేకుండా చర్చలు జరిగితే ప్రయోజనం ఏంటని మార్గాని భరత్ ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీతో మంచి జరుగుతుందని తెలుగు ప్రజలు ఆశించారని.. కానీ వారిని నిరాశ పరిచారని అన్నారు. తెలంగాణకు ఏపీ పోర్టులు, టీటీడీ అంశాలపై జరిగిన ప్రచారాన్ని కనీసం ఖండించడం కూడా చేయలేదని అసహనం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారని మార్గాని భరత్ తెలిపారు. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ మీటింగ్‌కు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. విభజన అంశాలపై జరిగిన ఈ భేటీలో పవన్‌కల్యాణ్ పాల్గొని ఉంటే.. ఆ సమావేశానికి ప్రాధాన్యం ఉండేదని అభిప్రాయపడ్డారు.