Anchor Kavyasri | రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడు రెచ్చిపోయాడు. ఓ ఈవెంట్ ఆర్గనైజర్, యాంకర్ కావ్యశ్రీపై దాడికి తెగబడ్డాడు. బాకీ డబ్బులు చెల్లించాలని అడిగినందుకు కావ్యశ్రీ తండ్రి నాగరాజును బూతులు తిడుతూ ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. ఈ తంతంగమంతా వీడియో తీస్తున్నదని యాంకర్ కావ్యశ్రీపైనా దాడి చేశాడు.
యాంకర్ కావ్యశ్రీ కుటుంబం కొంతకాలంగా రాజమండ్రిలో నివసిస్తోంది. వాళ్లు విజయవాడలో ఉన్న సమయంలో వారి నుంచి 2021 వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అనుచరుడు నల్లారి వెంకట శ్రీనివాస్, అతని కుమారుడు అభిషేక్ రూ.3లక్షలు అప్పుగా తీసుకున్నారు. కానీ ఎన్ని రోజులు అయినా ఆ డబ్బును తిరిగి ఇవ్వలేదు. డబ్బుల కోసం పదే పదే కాల్స్ చేయడంతో డబ్బులు ఇస్తా రమ్మని ఎన్వీ శ్రీనివాస్ చెప్పాడు. దీంతో రాజమండ్రిలో ఉన్న నల్లూరి శ్రీనివాస్ ఇంటికి కావ్యశ్రీ, ఆమె తండ్రి నాగరాజు వెళ్లారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలోనే నా ఇంటికే వచ్చి రచ్చ చేస్తారా అంటూ ఆగ్రహంతో ఎన్వీ శ్రీనివాస్ ఊగిపోయాడు. నాగరాజుపై, అడ్డొచ్చిన యాంకర్ కావ్యశ్రీపై దాడి చేశాడు.
వైసీపీ నాయకుడి దాడిపై యాంకర్ కావ్యశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. బాకీ డబ్బులు ఇవ్వమని గట్టిగా నిలదీయడంతో అహం దెబ్బతిని తమపై దాడి చేశారని తెలిపింది. అమ్మాయిని అని కూడా చూడకుండా తనపై దాడి చేశారని చెప్పింది. వీడియో తీస్తున్నా అని తెలిసి కూడా పొగరుతో రెచ్చిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.