అమరావతి : గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ గా వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి సంతోషి రూపవాణి ఎన్నికయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు ఎంపీపీ కార్యాలయంలో పటిష్ట బందోబస్తు ఉత్కంఠ మధ్య ఎన్నిక కొనసాగింది. ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో టీడీపీ, జనసేనలకు చెందిన గెలిచిన ఎంపీటీసీలో ఎవరూ బీసీలు లేకపోవడంతో వైసీపీ అభ్యర్థి సంతోషి రూపవాణితో ఎమ్మెల్యే ఆర్కే దగ్గరుండి నామినేషన్ను వేయించారు.
ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన 9 మంది సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది గెలుపొందగా ఒకరు జనసేనకు చెందిన అభ్యర్థి విజయం సాధించారు. గత సంవత్సరంన్నర క్రితం జరగవలసిన ఎన్నికను టీడీపీ సభ్యులు కోర్టుకు వెళ్లడంతో ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. వైసీపీ నాయకులు కోర్టును ఆశ్రయించడంతో వాదోపవాదాలు జరిగిన టీడీపీ వారు వేసిన పిటిషన్ను కొట్టివేయడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇవాళ ఎన్నికను నిర్వహించారు.
దుగ్గిరాల బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో బీఫామ్ ఇచ్చిన ఒకే ఒక్క అభ్యర్థి సంతోషి రూపవాణి నామినేషన్ దాఖలు చేసింది. గడువులోగా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అభ్యర్థి ఒకరు, ప్రతిపాదించే వారు ఒకరు, బలపరిచే సభ్యులు ఒకరు ఉంటేచాలని సూచించిన మేరకు ఎన్నిక జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. గెలిచిన రూపవాణికి ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. వైస్ ఎంపీపీగా టీడీపీ బలపరిచిన షేక్ జబీన్, రెండో వైస్ ఎంపీపీగా జనసేనకు చెందిన పసుపులేటి సాయిచైతన్య ఎన్నికయ్యారని అధికారులు వెల్లడించారు.