AP News | ఓ వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. పురిటి నొప్పులు వస్తున్నాయి ప్రసవం చేయాలని గర్భిణీ బంధువులు వెళ్లి ఎంత బతిమిలాడినా అటు వైద్యులు కానీ.. ఇటు సిబ్బంది కానీ నిద్రమత్తులో వినిపించుకోలేదు. ఇంతలో ప్రసవం జరిగి మగబిడ్డ పుట్టినప్పటికీ.. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ప్రాణాలు దక్కలేదు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేపు సామాజిక ఆరోగ్యం కేంద్రం(సీహెచ్‌సీ)లో శనివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పెద్దబొడ్డు వెంకటాయపాలేనికి చెందిన గర్భిణి చెక్కా మాధురికి నెలలు నిండటంతో శుక్రవారం ఉదయం తాళ్లరేవు సామాజిక కేంద్రంలో చేర్పించారు. శనివారం తెల్లవారుజామున మాధురికి నొప్పులు ఎక్కువయ్యాయి. ఆ సమయంలో మాధురి బంధువులు వెళ్లి వైద్యురాలు స్నేహలత, సిబ్బందిని లేపడానికి ప్రయత్నించారు. కానీ వారెవరూ నిద్రలేవలేదు. ఇంతలో మహిళా స్వీపర్ మంచం వద్దకు వెళ్లేసరికి మాధురికి మగబిడ్డను ప్రసవించింది. ఇది గమనించిన స్వీపర్ బిడ్డ పేగు కత్తిరించి సపర్యలు చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు స్టాఫ్ నర్సులు, వైద్యురాలు వచ్చి బిడ్డను పరిశీలించారు. అప్పటికి బిడ్డలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని, కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని సూచించారు. కంగారుపడిపోయిన గర్భిణీ బంధువులు వెంటనే పసికందును తీసుకుని కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లారు. అక్కడ శిశువును పరీక్షించిన వైద్యులు.. చాలాసేపటి క్రితమే మృతిచెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై గర్భిణి మాధురి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లరేవపు ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. శిశువు మృతికి కారణమైన వైద్యురాలు స్నేహలతను సస్పెండ్ చేయాలని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ఆందోళన చేయడంతో కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాగా, ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు స్టాఫ్ నర్స్ ఎ.ఇందిరను సస్పెండ్ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని కాకినాడ ఆర్డీవో తెలిపారు.