YS Jagan | ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. అబద్ధాలనే నిజాలుగా నమ్మించే యత్నానికి తెరలేపారని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ.. అప్పులపై తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు.
2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి 2.57 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని వైఎస్ జగన్ తెలిపారు. 2019 నాటికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న అప్పులు 55వేల కోట్లు అని పేర్కొన్నారు. మొత్తం కలిపి 3.13లక్షల కోట్లు అని చెప్పారు. అదే తాము దిగిపోయే నాటికి 4.91లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ గ్యారంటీ అప్పులు 1.54 లక్షల కోట్లు అని.. మొత్తం కలిపి 6.46 లక్షల కోట్లు అని చెప్పారు. 2023-24 కాగర్ రిపోర్టు కూడా 6.46 లక్షల కోట్లు అని చెప్పిందన్నారు. కానీ 12 లక్షల కోట్లు అని ఒకసారి, 14 లక్షల కోట్లు అని మరోసారి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు.తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు వ్యవస్థీకృతం చేశారని అన్నారు.
బడ్జెట్లో చెప్పిన లెక్కలకు, బయట చెప్పే లెక్కలకు తేడా ఎందుకు వస్తుందని జగన్ ప్రశ్నించారు. మీ బడ్జెట్ లెక్కలను మీరే ఎందుకు మార్చి చెబుతున్నారని నిలదీశారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు నిలదీస్తున్నారనే చంద్రబాబు బొంకుతున్నారని విమర్శించారు. మీ లెక్కలను మీరే ఒప్పుకోకపోతే బడ్జెట్ ఎందుకు పెట్టినట్లు అని ప్రశ్నించారు. బడ్జెట్లో ఒకటి పెట్టి బయట మరొకటి ఎందుకు చెబుతున్నారని అన్నారు. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదని ప్రశ్నించారు. 42.183 వేల కోట్ల బకాయిలు 2019లో బాబు మాకు గిఫ్ట్ ఇచ్చి వెళ్లారని అన్నారు. ఐదేళ్ల బాబు హయాంలో FRBM పరిధి దాటి 28 వేల 457 కోట్ల అప్పు చేశారని చెప్పారు. మా హయాంలో FRBM పరిధి దాటి 16 వందల 47 కోట్లు మాత్రమే అప్పు చేశామని అన్నారు. ఎవరి హయాంలో అప్పులు ఎక్కువయ్యాయో లెక్కలే చెబుతున్నాయని తెలిపారు. ఎవరు ఆర్థిక విధ్వంసకారులో ఈ లెక్కలే సాక్ష్యమని అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలు చేసే అప్పులు ప్రభుత్వ ఖాతాల్లోకి రావని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలుపుకున్నా మా హయాంలోనే తక్కువ అప్పులు అయ్యాయని అన్నారు. అందరూ కలిసి అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని పేర్కొన్నారు. మీ లెక్కలను మీరే ఒప్పుకోకపోతే బడ్జెట్ ఎందుకు పెట్టినట్లు అని నిలదీశారు. రాష్ట్ర వృద్ధి రేటు వైసీపీ హయాంలో 10.6 శాతానికి పడిపోయిందని.. వారి హయాంలో 13.5శాతం ఉందని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తమ హయాంలో కోవిడ్ మహమ్మారి పీడించిందని గుర్తుచేశారు. దేశ వృవద్ధి రేటు కూడా 9.28 శాతానికి తగ్గిపోలేదా అని ప్రశ్నించారు. ఈ విషయం మీకు తెలియదా అని నిలదీశారు. పారిశ్రామిక వృద్ధి రేటు మా హయాంలో 12.61 శాతానికి పెరిగిందని తెలిపారు. చంద్రబాబు హయాంలో 11.92 శాతమే పారిశ్రామిక వృద్ధి ఉందని అన్నారు.