అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra Babu ) భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan ) అన్నారు. తన పర్యటనకు వేలాదిమంది పోలీసులను మోహరించి తన అభిమానులను అడ్డుకోవడంపై మండిపడ్డారు. నెల్లూరు ( Nellore ) జిల్లా జైలులో ఉన్న వైసీపీ నాయకుడు కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించి ఇంటిపైకి టీడీపీ శ్రేణుల దాడుల గురించి వాకాబు చేశారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. తన పర్యటనను అడ్డుకోవడానికి అనేక ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందని సూపర్‌సిక్స్ హామీల గురించి ప్రశ్నించే గొంతులను నొక్కెస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలులో పెడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.
మహిళా నాయకులు రోజా, రజని, ఉప్పాడ హారిక పై అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం మాఫియాకు చంద్రబాబు డాన్ల వ్యవహరిస్తున్నారని తెలిపారు. మద్యం కమీషన్లను పంచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ పరిస్థితులే ఉదాహరణలని జగన్ అన్నారు. మరో మూడేళ్ల అనంతరం వైసీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబుకు, తప్పులు చేస్తున్న అధికారులకు లెక్క జమ తీసి చట్టం ముందు నిలబెడుతామని హెచ్చరించారు.