అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వంపై (Alliance government) ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు సర్‌చార్జీలు (Surcharges) పెంచడంపై ఆమె స్పందిస్తూ వైసీపీకి , కూటమి ప్రభుత్వానికి తేడాలేదని పేర్కొన్నారు. వైసీపీ (YCP) ప్రభుత్వం ఐదేండ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే మీరు మొదలు పెట్టారు కదా అంటూ ఎద్దేవా చేశారు.
శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉచిత సిలిండర్‌ను ఇచ్చి సర్‌చార్జీ పేరిట విద్యుత్ భారం మోపుతున్నారని ఆరోపించారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదే మరీ అంటూ వ్యాఖ్యనించారు. ప్రతి యేట ఉచిత సిలిండర్‌కు ప్రభుత్వంపై రూ. 2,685 కోట్లు ఖర్చు అవుతుంటే సర్‌చార్జీల వసూళ్లతో రూ. 6వేల కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం వల్లే సర్‌చార్జీలు వసూలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం కుంటిసాకులు చెబుతుందని పేర్కొన్నారు. సర్‌చార్జీలను ప్రభుత్వమే భరించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం సర్‌చార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ ఉద్యమిస్తుందని వెల్లడించారు.