అమరావతి : ఏపీలో త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవులపై (Nominated posts) ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandra Babu) స్పందించారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూటమి సభ్యులతో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా మూడో విడతను జూన్‌లోగా అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తామని ప్రకటించారు.
మంగళవారం టీడీపీ ( TDP ) ముఖ్య నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ( Teliconference ) చంద్రబాబు మాట్లాడారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ సభ్యుల పేర్లనే సిఫారసు చేయాలని జిల్లా నాయకులకు సూచించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహించాలని, పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని (MLAs) స్పష్టం చేశారు.
త్వరలో 214 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 1,100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు చేపడుతామని వెల్లడించారు. వ్యవసాయ మార్కెట్లు, ఆలయ కమిటీలకు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. పదవి ఆశిస్తున్న వాళ్లంతా ఆయా విభాగాల్లో సభ్యులుగా ఉండాలని, కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్నారు.
ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించుకుంటూ , తమ పనితనాన్ని మెరుగుపరుచకుంటూ పనిచేయాలని వివరించారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని , ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని వెల్లడించారు. వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదులో బాగా పనిచేసిన వారిని పదవుల్లో ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.