Srisailam | శ్రీశైల క్షేత్ర శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయస్వామికి ( శ్రీపాదవల్లభుడు ) గురువారం ప్రత్యేక పూజలు చేశామని ఈవో ఎస్ లవన్న తెలిపారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం శాస్త్రోక్తంగా అభిషేకార్చనలు జరిపించి భక్తులకు దర్శనాలు కల్పించారు. వివిధ ప్రాంతాల నుండి క్షేత్రానికి వస్తున్న యాత్రికులతో పుర వీధులన్నీ ఆధ్యాత్మిక సందడి సంతరించుకున్నాయి.
గర్బాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, కుంకుమార్చనలు పున:ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో వస్తున్న భక్తులు దర్శన సమయంలో సిబ్బందికి సహకరించాలని ఈవో లవన్న కోరారు. రద్దీకి అనుగుణంగా దేవస్థానం అన్ని ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నది. ఉభయ దేవాలయాలతోపాటు హఠకేశ్వరం, ఫాలధార పంచధార, సాక్షి గణపతి, శిఖరేశ్వర ఆలయాలకు వచ్చిన భక్తులతో సందడి నెలకొంది.
శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులకు పౌష్టిక విలువలతో కూడిన రుచికరమైన ఆహారం వడ్డించాలని ఈవో ఎస్ లవన్న అన్నదానం విభాగం అధికారులను ఆదేశించారు. గురువారం తెల్లవారుజామున అన్నదాన భవనంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వంట గదులలో పరిశుభ్రత, స్టోర్ల నిర్వహణ, కూరగాయలు భద్రపరిచే శీతలకేంద్రం, రోజువారి వంటకాల ముందస్తు ప్రణాళికల అమలు వంటి విషయాలను పరిశీలించారు.
అన్నదానం ఇన్చార్జ్ దేవిక, ఈఈ రామకృష్ణ, డీఈ నర్సింహారెడ్డిలకు ఈవో లవన్న పలు సూచనలు చేశారు. ప్రతినిత్యం అల్పాహారంలో ఇడ్లీలు చేయించాలని చెప్పారు. అదే విధంగా నిరుపయోగంగా ఉన్న చపాతీల యంత్రానికి వెంటనే మరమ్మతులు చేయించి ప్రతి రోజు రాత్రి వేళలో చపాతీలను కూడా భక్తులకు అందించాలని అన్నారు.