అమరావతి : వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి( Peddireddy Ramchander Reddy) కుటుంబం ఆక్రమించుకున్న అటవీ భూములను( Forest Lands) స్వాధీనం చేసుకుంటామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు ( Chief Conservator Chalapati Rao ) అన్నారు.
చిత్తూరు జిల్లా మంగళంపేటలో పెద్దిరెడ్డి కుటుంబానికి 74 ఎకరాలు భూములున్నాయని తెలిపారు. అయితే అటవీ భూములైన 32. 63 ఎకరాలను ఆక్రమించుకుని మామిడి, ఉద్యాన పంటలను సాగు చేశారని, ఈ భూములను స్వాధీనం చేసుకుని పంటలను పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి, ఇందిరమ్మ, మిథున్ రెడ్డి, భాస్కర్ రెడ్డిపై కేసులు నమోదు చేశామని, కోర్టులో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
అటవీ భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారని తెలిపారు. సర్వే పూర్తి చేసి స్థలాల వివరాలతో వెబ్ ల్యాండ్‌లో పెడతామన్నారు. రాష్ట్రంలో అటవీ భూముల అన్యాక్రాంతాన్ని గుర్తించేందుకు కమిటీలు వేశామన్నారు. అటవీ భూములు కబ్జాకు గురైనట్లు కమిటీ నిర్ధారించిందని చెప్పారు.
కొన్ని రిట్ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయని, ఎక్కడ ఆక్రమణలు ఉన్నా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమాలను ప్రోత్సహించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.