Pawan Kalyan | జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నామని తెలిపారు. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటానని.. అలాగే విపక్షంగానూ ఉంటామని పేర్కొన్నారు. టెక్నికల్‌గా అదెలా సాధ్యమనేది ఆలోచిస్తున్నామని చెప్పారు. కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించి కావాల్సినవి సాధిస్తామని తెలిపారు.
జనసేన ఎమ్మెల్యేలతో బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జనసేన గోరంత దీపం కొండంత వెలుగునిచ్చిందని అన్నారు. జనసేన ఆఫీసు 24 గంటలు పనిచేయాలనేది తన కోరిక అని తెలిపారు. ప్రజలకు ఎప్పడూ అందుబాటులో ఉండేలా ఆఫీసును తీర్చిదిద్దుతామని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్‌పైనే తన దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆరు అంశాలపైనే ప్రజలకు మొదట భరోసా కల్పించాలని అన్నారు. తనకు మించిన మెజార్టీ జనసేన అభ్యర్థులకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.. ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటా..బాధ్యతగా పనిచేస్తానని స్పష్టం చేశారు.