అమరావతి : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టాణాభివృద్ధిశాఖా మంత్రిగా పొంగూరు నారాయణ (Minister Narayana) ఆదివారం వెలగపూడలోని సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. కార్యాయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి (Capital Amaravati) రైతులు మంత్రి నారాయణను సన్మానించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో రాజధాని పునర్మిర్మాణ పనులు ప్రారంభిస్తామని వివరించారు. పనుల పూర్తికి 15 రోజుల్లో అధ్యయనం చేసి టైమ్‌బౌండ్ నిర్ణయిస్తామని వెల్లడించారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని, రాజధాని తొలిదశ పనులకు రూ. 48 వేల కోట్లు ఖర్చవుతాయని అన్నారు. మూడు దశల్లో రాజధాని నిర్మాణానికి రూ. లక్ష కోట్ల ఖర్చు అవుతుందని తెలిపారు.
రాజధానిలో రోడ్ల ధ్వంసం, చోరీలపై చర్యలు తీసుకునేందుకు కమిటీ వేసి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ఐదేళ్లుగా అన్న క్యాంటీన్లు మూసివేశారని , టీడీపీ హయాంలో 4.60 కోట్ల ప్లేట్లు సర్వ్ చేశారని పేర్కొన్నారు. పేదలు ఎక్కువగా ఉన్న చోట అన్నక్యాంటీన్ల (Anna Canteens) ను ఏర్పాటు చేసి ప్రతి రోజు 2.25 లక్షల మంది పేదలకు రూ. 5కే భోజనం అందించామని, తిరిగా అన్న క్యాంటీన్ల ప్రారంభానికి అధ్యయనం చేయాలని సూచించానని తెలిపారు . భోజన సరఫరా, అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ఇవ్వడంపై పరిశీలన చేస్తున్నామని వివరించారు.