అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనకు అడ్డుకట్ట వేయకపోతే పోలీసుల ఆలోచనను ప్రజాశక్తి తో మారుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. క్విట్ జగన్ -సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ముద్రించిన బుక్‌లెట్‌ను టీడీపీ ఏపీ కార్యాలయంలో చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆయన మాట్లాడుతూ ఏపీలో కొత్త డీజీపీ వచ్చిన తరువాత అరాచకాలు మరింత పెరిగాయని ఆరోపించారు. శాంతి భద్రతలను పరిరక్షించవలసిన పోలీసులు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు.
ప్రశ్నించేవారిపై కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసులు ప్రజల్లో చులకన య్యారని, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై గౌరవం పోయిందని అన్నారు. మాచర్ల, ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక కుటుంబాలు వైసీపీ ధాష్టికాల వల్ల వేరే ప్రాంతాల్లో బ్రతుకుతున్నారని తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో సంబంధమున్న శ్రీనివాస్‌రెడ్డి, గంగిరెడ్డి, గంగాధర్ రెడ్డి అనే వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మరణాల వెనుక ఉన్న కారణాలను ఎందుకు అన్వేషించడం లేదని పోలీసులను ప్రశ్నించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 60 మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారని, 4వేల మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. శాంతియుతంగా ఉండే రాష్ట్రాన్ని మూడేళ్లలో వల్లకాడు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కట్టడి చేయకుంటే రాష్ట్రం అంధకారమవుతుందని పేర్కొన్నారు.