అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే ఉత్తమ పారిశ్రామక విధానాన్ని తీసుకురానున్నామని ఏపీ మంత్రి భరత్ (Minister TG Bharat) వెల్లడించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu) తో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014-19 వరకు చంద్రబాబు హయాంలో ఏపీలో పారిశ్రామిక విధానాన్ని (Industrial policy ) కి ఆకర్షితులైన అనేక మంది పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారని వివరించారు.
వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వం ఐదేండ్లలో పరిశ్రమల ఏర్పాట్లకు ఫ్రెండ్లీ వాతావరణం కల్పించలేకపోయారని ఆరోపించారు. గతంలో పెట్టుబడులకు పారిశ్రామకవేత్తలు భయపడే పరిస్థితి ఉండేదని ఆరోపించారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పారిశ్రామకి క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని వెల్లడించారు.
ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రీయల్ పాలసీ, ఎంఎస్ఎంఈ , క్లస్టర్ పాలసీని 45 రోజుల్లో తీసుకురానున్నామని తెలిపారు. ఏపీలో సహజ సిద్ధమైన వనరులున్నాయని, వాటిని వినియోగించుకుని ముందుకు వెళ్తామని వివరించారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో భూముల ధరల తగ్గింపుపై చర్చ జరిగిందన్నారు. ప్రస్తుతం ఓర్వకల్లు, కృష్ణపట్నం, ఏపీ బల్క్‌డ్రగ్ పార్క్, కడప జిల్ల కొప్పర్తిలో క్లస్టర్లున్నాయని తెలిపారు.
కొత్తగా కుప్పం, లేపాక్షి, శ్రీకాకుళం జిల్లా మొల్లపేట, ప్రకాశం జిల్లా దోనకొండలో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారని వెల్లడించారు. సుమారు 75 వేల కోట్ల రూపాయల వ్యయం కాగల బీపీసీఎల్ ఇండస్ట్రీ ఏపీకి రాబోతుందని వివరించారు.