Srisailam | ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అఘోరి నాగసాధు ఆదివారం శ్రీశైల క్షేత్రానికి చేరుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కార్తీకమాసం సందర్భంగా శైవ క్షేత్రాలను దర్శించుకుంటున్న ఆమె ఆదివారం ఉదయం శ్రీశైలం చేరుకుంటున్న విషయం తెలుసుకున్న డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ ప్రసాద్ రావు, సీఎస్వో సాములు ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. దేవస్థానం నిబంధనల ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించి ఉభయ దేవాలయాల్లో దర్శనాలు చేసుకోవాలని సూచించడంతో ఆమె అంగీకరించారు.
స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైన మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యమని అన్నారు. గోవులను రక్షించుకునేందుకు కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అదే విధంగా చిన్నారులు, బాలికలు, మహిళలు, చివరకు వృద్ధులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే చట్టాలు వచ్చే వరకు తన పోరాటం ఆగదని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్న తనను పలు విధాలుగా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేయకుండా సహకారం అందించాలని కోరారు. శ్రీశైలం నుండి కోటప్పకొండ, విజయవాడ ఆలయాలు దర్శించుకుని కుంభమేళాకు వెళ్తున్నట్లు ఆఘోరి నాగసాధు తెలిపారు.