Vangalapudi Anitha | మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచార ఘటన బాధాకరమని అన్నారు. ఈ కేసులో 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. పట్టుబడిన నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని చెప్పారు. నిందితుల్లో ఒకరిపై 32 కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఈ కేసును స్పెషల్ కోర్టుకు అప్పగిస్తామని తెలిపారు. నిందితులకు త్వరగా శిక్షపడేలా చేస్తామని హామీ ఇచ్చారు.
ఏపీలో నేరాలు తగ్గిండచడమే తమ ప్రాధాన్యమని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. నేరాలు ఎక్కడ జరిగినా ముందే మేలుకోవాలని సూచించారు. ఒకవేళ నేరం జరిగినట్లయితే నిందితులకు కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. నేరాలు చేసినవాళ్లు తప్పించుకోకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్ని ప్రార్థనాలయాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్కూళ్లు, కాలేజీల దగ్గర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి కేసుల్లో జాప్యం లేకుండా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో ఏ చిన్న ఘటన జరిగినా సరే ముఖ్యమంత్రే స్వయంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఘటనపై సీఎం వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారని అన్నారు.
కాగా, మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు కచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సూచించారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై సోమవారం డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ ఘటనలో నిందితులకు తక్షణం శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసును విచారించాలని ఆదేశించారు. దీని కోసం హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామన్నారు. దీనితో పాటు గతంలో బాపట్ల జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు, మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళ స్వేచ్ఛగా తిరిగేలా రాష్ట్రంలో శాంతి భద్రతలు కల్పించేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.