Ram Madhav on AP Capital | ఆంధ్రప్రదేశ్ విభజన.. రాజధానిపై బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ఏర్పాటు చేసి ఏడేండ్లు గడిచినా.. విభజిత ఏపీకి రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దీనికి దేశ రాజకీయ వ్యవస్థలో లోపం కాదా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన గుంటూరులో స్వాధీనత నుంచి స్వతంత్రత వైపు అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా మనదేశంలో ఇంకా స్వాభిమానం అలవాటు కాలేదన్నారు. దీనికి రాజకీయ వ్యవస్థలోని అవినీతే కారణం అని వ్యాఖ్యానించారు. దేశంలో మంచి వ్యవస్థలు నెలకొల్పితేనే ప్రజలెక్కడికి వెళ్లినా గౌరవం లభిస్తుందన్నారు.
అరబ్ దేశాల్లో ముస్లిం మహిళలు బురఖాకు వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి పోరాడుతున్నారని రాం మాధవ్ చెప్పారు. కానీ మనదేశంలో బురఖా ధరించాలని చెబుతూ దాన్ని మత పరమైన సమస్యగా మారుస్తున్నారని ఆరోపించారు. ఇది దేశంలో మత పరమైన విభజనకు ప్రయత్నించడమేనని చెప్పారు. బురఖా ధరించనవసరం లేదని సౌదీ అరేబియా రాజు చెప్పారన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అందరూ ప్రధాని నరేంద్రమోదీ సాయం కోరుతున్నారని రాం మాధవ్ చెప్పారు. కానీ, భారత్ శాంతి వైపు ఉందన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా భారత్ నిలుస్తుందన్నారు.