అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజలు చారిత్రత్మాక తీర్పును ఇచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. ఏపీ ఎన్నికల్లో పోటీ చేసినా 21 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానంలో విజయం సాధించిన సందర్భంగా మంగళగిరిలోని జనసేన(Janasena) పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో వైఎస్ జగన్(YS Jagan), వైసీపీ శ్రేణులు తమకు శత్రువులుకారని తేల్చిచెప్పారు. కక్ష సాధింపు చర్యలకు ఇది సమయం కాదని 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బలమైన పునాది వేసే సమయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా జవాబుదారితనంతో పనిచేస్తామని వెల్లడించారు.
ఇక ఏపీకి చీకటి రోజులు ముగిసాయని అన్నారు. కూటమి ఏపీ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అన్నారు. జనసేన 21 కి 21 సీట్లు గెలుస్తుందని అనుకోలేదు. భారతదేశంలో ఇంతవరకు జనసేనకు తప్పా ఏ పార్టీకి ఈ ఘనత దక్కలేదని సంతోషం వ్యక్తం చేవారు. వచ్చే ప్రభుత్వం అన్నం పెట్టే రైతన్నకు, ఆడబిడ్డలకు రక్షణగా ఉంటుందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. మెగా డీఎస్సీ(Mega DSC) బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు బలంగా ఉంటాయని ధీమాను వ్యక్తం చేశారు. పరిపాలనలో రాజకీయం ఉండదని భరోసా ఇచ్చారు. 2019లో నేను ఓడిపోయినా నాకున్న మానసిక స్థితి ఎలా ఉందో నేడు గెలిచినా అదే మానసిక స్థితి నాలో ఉందని, అదే ధైర్యంతో ఉన్నానని పేర్కొన్నారు. గెలుపు భయమేసినా అంతకంటే రెట్టింపుగా పనిచేసే బాధ్యత తమపై ఉందని అన్నారు. జనసేన ధర్మం కోసం నిలబడిందని, ఎన్నికల్లో ధర్మమే మన కోసం నిలబడిందని అన్నారు. వచ్చే రోజుల్లో నిర్మాణాత్మకంగా పనిచేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.