అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పాలనా వికేంద్రీకరణ వైసీపీ ప్రభుత్వ విధానమని తెలిపారు. విభజన సమయంలో రాజధానిపై శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలో పాలన వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. ఈ అంశాన్నే తీసుకుంటామని వెల్లడించారు. తమ నాయకుడు వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలే తమకు ప్రామాణికమని అన్నారు.
టీడీపీ నేతల ఆలోచనలు లెక్కలోకి తీసుకోబోమని తెలిపారు. ఏపీలో జిల్లాల పునర్విభజనపై వినతులను కమిటీ పరిశీలిస్తోందని మంత్రి బొత్స వివరించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని ఏపీ హోం మంత్రి సుచరిత నిన్న తెలిపారు. తాము ఇప్పటికీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, రాజధానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని తెలిపారు. అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, సీఆర్డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని తెలియజేసింది. శాసనసభకు లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని, శాసన అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని కోర్టు తీర్పులో వెల్లడించింది