అమరావతి : ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత వాలంటీర్లు (Volunteers ) అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. తమను ఉద్యోగంలో ఉంచుతారా ? లేదా అనే సందిగ్దతకు లోనవుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో వాలంటీర్లచే బలవంతంగా రాజీనామాలు చేయించి రాజకీయంగా లబ్దిపొందేందుకు యత్నించిన వైసీపీ (YCP Leaders) నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా నెల్లూరులో వైసీపీ నాయకులపై వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు ( Police complaints) చేశారు. శనివారం రాత్రి నెల్లూరు జిల్లా చిన్నబజారు పోలీసు స్టేషన్లోనూ మరికొందరు వాలంటీర్లు స్థానిక కార్పొరేటర్, వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు బలవంతంగా రాజీనామా చేయించారని వేదాయపాలెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా మీటింగ్ పేరు చెప్పి రాజీనామా చేయించారని ఆరోపించారు.
రెండు రోజుల క్రితం వాలంటీర్లు స్థానిక ఎమ్మెల్యేలను కలిసి తమను ఉద్యోగం నుంచి తొలగించివద్దని విన్నపాలు అందజేస్తున్నారు. వైసీపీ ఒత్తిళ్ల వళ్ల లక్ష 8వేల మంది వరకు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజీనామా చేసిన వారిని ఉద్యోగంలోకి తీసుకోబోమని వార్తలు వస్తుండడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు.
ఎలాగైనా తామే అధికారంలోకి వస్తామని వాలంటీర్లను బలి చేశారని ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం లక్ష 25 వేల మంది వాలంటీర్లను నియమించి వారితో పలు సామాజిక పింఛన్ల పంపిణీతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించి వారికి గౌరవ వేతనం అందిస్తు వచ్చింది.