Gajapathinagaram | విజయనగరం జిల్లా గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల తనిఖీ ఇప్పుడు పలు అనుమానాలను రేకిత్తిస్తున్నది. వైసీపీ పిటిషన్ మేరకు నెల్లిమర్లలో ఈవీఎంల వెరిఫికేషన్ కోసం వచ్చిన అధికారులు గోదాము తాళాలు లేవని మూడు గంటల పాటు కాలయాపన చేశారు.
వెరిఫికేషన్‌కు వచ్చిన అధికారులు తాళాలు కనిపించడం లేదని చెప్పడంతో కలెక్టర్ అంబేద్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తలుపులు పగులగొట్టి ఈవీఎంల తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. గోదాం తాళాలు లేకపోతే బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాలతో ఏం చేయాలో తెలియని అధికారులు చివరకు తాళాలు దొరికాయంటూ తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో అప్పుడు ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు.
కాగా, పెదకాద పోలింగ్ బూత్ నంబర 20లో ఈవీఎంలు తనిఖీ చేయాలని, వీవీప్యాట్ లెక్కించాలని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదుకు సంబంధం లేకుండా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. పెదకాద ఈవీఎంలో డేటా మొత్తాన్ని అధికారులు తొలగించారు. వీవీప్యాట్ బాక్సుల్లోనూ వీవీప్యాట్లు కనిపించలేదు. ఈవీఎంలో డేటా తొలగించి కొత్త గుర్తులను లోడ్ చేశారు. కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అడిగినప్పటికీ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం సీసీ టీవీ ఫుటెజ్, బ్యాటరీ లెవల్ డేటాను ఎన్నికల అధికారులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలులోనూ ఇదే పరిస్థితి రిపీట్ అయ్యింది. వెరిఫికేషన్‌కు బదులు కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించారు.