విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిస్తారు. ఈ నెల 30వ తేదీన స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణపై వైసీపీ అనర్హత వేటు వేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వంశీకృష్ణ అనర్హత నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ జగన్ ఖరారు చేశారు. ఇక కూటమి నుంచి ఎమ్మెల్సీ టికెట్ కోసం ఐదుగురు అశావహులు ప్రయత్నిస్తున్నారు. కానీ అభ్యర్థి ఎంపికపై చంద్రబాబే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మన్సిపల్ కార్పరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అంటే ఉమ్మడి విశాఖ పరిధిలో మొత్తం 841 ఓట్లర్లు ఉన్నారు. వైసీపీకి బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి. మరో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.