MVV Satyanarayana | విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతోంది. గత ఏడాది జరిగిన కిడ్నాప్ కేసును రీఓపెన్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. తన కుటుంబం కిడ్నాప్ కేసులో పునర్విచారణ చేస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మళ్లీ విచారణ జరపాలని కోరుతున్నానని ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. రౌడీషీటర్ హేమంత్‌తో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. హేమంత్ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటకు తెచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హేమంత్‌కు ఖరీదైన ఆస్తులు, కార్లు ఇచ్చామనడంలో వాస్తవం లేదని తెలిపారు. ఖరీదైన బంగళాలు ఇచ్చి ఉంటే అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలని సీరియస్ అయ్యారు. నిరాధార ఆరోపణలతో తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని అన్నారు. హేమంత్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని చెప్పారు. డబ్బుల కోసమే తన కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని స్పష్టం చేశారు.
వైజాగ్‌లోని హయగ్రీవ భూములకు సంబంధించిన ఆరోపణలపైనా ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. హయగ్రీవ ప్రాజెక్టు వ్యవహారంతో తనకు సంబంధం లేదని తెలిపారు. సీబీసీఎన్సీ భూముల టీడీఆర్ తాను తీసుకోలేదని పేర్కొన్నారు. కేవలం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మాత్రమే చేస్తున్నానని స్పష్టం చేశారు. కూర్మన్నపాలెం ప్రాజెక్టు ఒప్పందం ప్రకారమే జరిగిందని చెప్పారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.