అమరావతి : ఏపీలో ఇటీవల వరద (AP Floods) విపత్తుకు గురైన విజయవాడ బాధితులకు అండగా నిలిచేందుకు సినీ రంగంలోని ప్రముఖులు ఇతోధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) కు విరాళాలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna)తో కలిసి విశ్వక్సేన్ (Vishwaksen) , జొన్నల గడ్డ సిద్ధు (Siddu) గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బాధితులకు ప్రకటించిన సహాయాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కులను అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బాలకృష్ణ రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. సిద్దు జొన్నలగడ్డ ఏపీకి రూ.15 లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు, విశ్వక్సేన్ ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5లక్షలను విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టు వద్ద బాలయ్య మీడియాతో మాట్లాడారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తుఫాన్లాంటి ఉపద్రవాలు సంబవించినపుడు ఎన్టీఆర్ (NTR) లాంటి సినీ దిగ్గజాలు జోలపట్టి విరాళాలు సేకరించి బాధితులను ఆదుకున్నారని అన్నారు. తెలుగు ప్రజలకు ఏ సమస్య వచ్చినా సినీరంగం తన వంతు సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.
ఏపీలో వరదలను ప్రభుత్వం సృష్టించిందని కొందరు వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితుల కోసం సాయం చేసిన వాళ్లందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. విపత్తుల సమయంలో కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా స్పందించిందని పేర్కొన్నారు.