Trains Cancel | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కంటకాపురం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం విశాఖపట్నం-రాయ్ పూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లతోపాటు విశాఖ- రాయ్ పూర్ కోర్బా రైలు సర్వీసులను రద్దు చేశారు. ఇక కోణార్క్, ఫలక్ నుమా, నాగావళి రైళ్లను విజయనగరం టిట్లాఘడ్, నాగ్ పూర్, ఖాజీపేట మీదుగా దారి మళ్లిస్తారు. రైలు ప్రమాదం నేపథ్యంలో బాలుగామ్ దగ్గర పూరీ- తిరుపతి రైలు నిలిపివేశారు. హైదరాబాద్-భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ను అనకాపల్లి రైల్వే స్టేషన్లో నిలిపి వేశారు.
రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలియగానే కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మాట్లాడారు. రైలు ప్రమాద వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రైలు ప్రమాద మృతులకు ఏపీ సర్కార్ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాద స్థలం వద్ద సహాయ చర్యలు చేపట్టారు. మొత్తం 14 అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి.
రైలు ప్రమాద వివరాలు తెలిపేందుకు విశాఖపట్నంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. రైల్వే ప్రమాదంపై హెల్ప్ లైన్ నంబర్లు : 89127 46330, 89127 44619.
విజయనగరం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రైల్వే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైలు ప్రమాదం పట్ల వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలను వైవీ సుబ్బారెడ్డి తెలుసుకున్నారు.