విశాఖపట్నం: గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా విశాఖపట్నం గాజువాకలో అత్యంత ఎత్తైన గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గాజువాక లంకా మైదానంలో ‘కైలాస విశ్వరూప మహా గణపతి’ 89 అడుగుల ఎత్తుతో కొలువుదీరనున్నాడు. మూడు కన్నుల శివుడు.. గణేశుడిని ఒక కన్నుగా, పార్వతి దేవిని మరొక కన్నుగా సిద్ధమవుతున్న ఈ మహాగణపతి భక్తులను అలరించనున్నాడు.
నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, మట్టితో చేసిన ఈ విగ్రహం ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్దది. గతంలో మాదిరిగానే 89 అడుగుల విగ్రహాం తయారీ పనులు ఊపందుకున్నాయి. మరో ఐదు రోజుల్లో పనులు పూర్తికానున్నాయి. మిగిలిపోయిన పనుల్ని పండగ మరుసటి రోజు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, గత ఏడాది మాదిరిగానే తాపేశ్వరం శ్రీ భక్తాంజనేయ సురుచి ఫుడ్స్ 35 కిలోల లడ్డూ ఇవ్వనున్నారు. గతంలో ఈ సంస్థ సమర్పించిన లడ్డూ గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నది. ఈ విగ్రహాన్ని హైదరాబాద్ ఖైరతాబాద్‌కు చెందిన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ కళాకారుల బృందం తయారు చేసింది.
ఒడిశా, తమిళనాడుకు చెందిన కళాకారుల సహకారంతో తెల్లటి మట్టి, వెదురు కర్రలతో ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. గాజువాక పండల్తో పాటు దొండపర్తిలో మరో భారీ విగ్రాహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ కోల్‌కతాకు చెందిన కళాకారులు 48 అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా విశాఖ నగరంలో గత రెండేండ్లుగా వేడుకలు స్థబ్దుగా జరుగుతుండటంతో అక్కడి ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈసారి గాజువాక, దొండపర్తిలో భారీ విగ్రహాలు నిలుపుతుండటంతో.. ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అని స్థానికులు ఉబలాటపడుతున్నారు. గణపతి విగ్రహాల ఎత్తుపై ఎలాంటి పరిమితులు విధించకపోవడంతో ఉత్సవ నిర్వాహకులు తాజా థీమ్‌లతో ముందుకు వస్తున్నారు. ఈసారి వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఒకరికొకరు పోటీ పడాలని భావిస్తున్నారు.