Srisalam | శ్రీశైలం : శ్రీశైలం దేవస్థాన క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రుడికి మంగళవారం దేవస్థానం ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. మంగళ, అమావాస్య రోజుల్లో స్వామివారికి విశేష అభిషేక, అర్చన నిర్వహించనున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో స్వామివారికి పంచామృతాలు, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. వీరభద్రుడు శివగణాలకు అధిపతి. శ్రీశైలం క్షేత్రపాలకుడి ఉంటూ ఆలయానికి దగ్గరలో ఆరుబయటనే దర్శనమిస్తాడు. స్వామివారిని దర్శించినంత మాత్రానే క్లిష్ట ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని.. వ్యాధులు తొలగిపోయి ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. మంగళ, ఆదివారాలు, అమావాస్య రోజుల్లో వీరభద్రుడికి పూజలు చేస్తే అనేక ఫలితాలుంటాయని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్ట గ్రహపీడలు తొలగిపోతాయని.. సంతానం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం.
ఆలయంలోని నందీశ్వరుడికి మంగళవారం సర్కారీ సేవగా విశేష పూజలు నిర్వహించారు. ప్రదోషకాలంలో సాయం సంధ్యాసమయంలో విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. మొదట అర్చకస్వాములు, వేదపండితులు లోక క్షేమం కాక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ నిర్వహించారు. అనంతరం పంచామృతాలతోనూ, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నాభిషేకం నిర్వహించి వృషభసూక్తం, వేదమంత్రాలు పటించారు. అనంతరం నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పించారు. చివరగా నానబెట్టిన శనగలను నివేదించారు.