Vizag | సాధారణంగా పాము పేరు చెబితేనే గుండెలు అదురుతాయి. అలాంటిది అరడుగుల నాగు పాము పడగ విప్పి కనిపిస్తే ఇంకేమైనా ఉందా? కానీ అలా కనిపించిన ఓ శ్వేత నాగును గమనించిన ఓ స్నేక్ క్యాచర్ పాము పడగపై గాయమైనట్లు గుర్తించాడు. అంతేకాకుండా దాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి సర్జరీ కూడా చేయించాడు. ఏపీలోని విశాఖపట్నంలో అరుదైన సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం సింధియా పరిధిలోని నేవల్ క్యాంటీన్ సమీపంలో అరడగుల శ్వేత నాగు కనిపించింది. స్థానికుల అరుపులతో బయపడిన పాము వెంటనే అక్కడే ఉన్న ఓ అట్ట డబ్బాలో దూరింది. భయపడిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న నాగరాజు శ్వేత నాగును పట్టుకున్నారు. ఈ క్రమంలో పడగ విప్పిన శ్వేత నాగును గమనించిన నాగరాజు.. దాని పడగపై గాయాలు ఉండటం గుర్తించాడు. వెంటనే దాన్ని హిందూస్థాన్ షిప్‌యార్డ్ కాలనీలోని పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యాధికారి సీహెచ్ సునీల్‌కుమార్ పాముకు మత్తు మందు ఇచ్చి గాయానికి శస్త్ర చికిత్స చేశారు. పడగపై అయిన గాయానికి 8 కుట్లు వేశారు. పాము పూర్తిగా కోలుకున్న తర్వాత దాన్ని సురక్షితమైన ప్రదేశంలో విడిచిపెడతామని వైద్యులు తెలిపారు.
విశాఖలో గాయపడిన నాగుపాముకి శస్త్రచికిత్స
పాము పడగపై ఉన్న గాయానికి 8 కుట్లు వేసిన వైద్యులు pic.twitter.com/LJVcj5ZrxU
— BIG TV Breaking News (@bigtvtelugu) November 1, 2025