అమరావతి : విశాఖపట్నం స్టీల్ (Visaka Steel) ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా ప్రస్తుత వైజాగ్ పార్లమెంటు సభ్యుడు భరత్ మతుకుమల్లి , స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (YCP MP Vijaya Sai Reddy) ఎక్స్ వేదిక ద్వారా డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivas Rao) 2021 ఫిబ్రవరిలో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. గంటా శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకుని ఎంపీ , ఎమ్మెల్యే రాజీనామా చేయకపోయినా, ప్రభుత్వంపై వత్తిడి చేయకపోయినా చరిత్ర వారిని ద్రోహులుగా, మోసగాళ్లుగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు వారిద్దరినీ క్షమించరని, వారు చేసిన ద్రోహానికి ప్రజలు వారిద్దరికీ గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
చంద్రబాబు(Chandra Babu) హయాంలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైందని , బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమేనని ఆరోపించారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహమని విమర్శించారు. టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆరోపించారు.
ఏ మాత్రం పట్టింపు ఉన్నా చంద్రబాబు తక్షణం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సంపదను అమ్మకానికి పెడ్తుంటే వైస్సార్ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి వైజాగ్ స్టీల్ ను రక్షించే దాకా పోరాటం సాగిస్తుందని వెల్లడించారు.