తిరుపతి : సూర్య జయంతి సందర్భంగా ఈనెల 28న తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహించనున్నామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పలు సేవలను రద్దు చేస్తున్నామని వెల్లడించారు. రథసప్తమి వేడుకలను ప్రతి ఒక్కరూ తమ విధులను మరింత అంకితభావంతో నిర్వహించాలని ఉద్యోగులకు, సిబ్బందికి ఆదేశించారు.
రథసప్తమి రోజున శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. రథసప్తమి పురస్కరించుకుని 28న తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దుచేసామన్నారు. భక్తులు ఆ రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని తెలిపారు. వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు ,దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేశామని పేర్కొన్నారు.
27, 28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్ రద్దు చేశామని, వసతి కేటాయింపు కోసం ఈ రెండు రోజుల్లో సీఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయని వివరించారు. రోజువారీ 3.5 లక్షల లడ్డూల తయారీతో పాటు 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుతారని తెలిపారు. తిరుమలలోని గ్యాలరీలు, వైకుంఠం క్యూ కాంప్లెక్సు- 1, 2, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లు, మినీ అన్నప్రసాదం కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, పాలు పంపిణీ చేస్తారని వెల్లడించారు.
సమయాన్ని పాటించకపోతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనం
శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా టీటీడీబ టైమ్ స్లాట్ టిక్కెట్లు, టోకెన్లను జారీ చేస్తోందని తెలిపారు. ప్రతిరోజూ దాదాపు 3000 మంది భక్తులు స్లాట్ సమయాన్ని అనుసరించడం లేదని, నిర్దేశించిన సమయం కంటే చాలా ఆలస్యంగా వస్తున్నారని తెలిపారు. ఇకపై నిర్ణీత సమయానికి రాని భక్తులను టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి అనుమతిస్తారని ఈవో పేర్కొన్నారు.