Vijayawada | ప్రేమ వివాహం చేసుకున్న ఓ మహిళ.. భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి, విజయవాడలో అద్దె గదిలో ప్రియుడితో గడిపేది. ఈ క్రమంలో 18 నెలల చిన్నారి అడ్డుగా మారడంతో ఆ ప్రియుడు అమానుషంగా గోడకేసి కొట్టి హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
విజయవాడ వాంబే కాలనీకి చెందిన మహిళ, గన్నవరానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఐదేళ్ల కొడుకు, 18 నెలల పాప ఉన్నారు. ఈ క్రమంలో తన భర్త స్నేహితుడు కనిజం వంశీతో వివాహేతర బంధం ఏర్పడింది. భర్త స్నేహితుడితో ఎక్కువసేపు గడిపేందుకు గాంధీ నగర్లో ఓ అద్దె ఇంటిని కూడా తీసుకుంది. పుట్టింటికి వెళ్తున్నాననే సాకుతో.. తరచూ అక్కడికి వెళ్లి అతనితో సహజీవనం చేసేది.
ఈ క్రమంలోనే బుధవారం నాడు తన కుమార్తె హర్షితను తీసుకుని సదరు మహిళ వంశీ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో కోపోద్రేక్తుడైన వంశీ.. 18 నెలల చిన్నారి గోడకేసి బలంగా కొట్టాడు. దీంతో హర్షిత అక్కడికక్కడే మృతిచెందింది. పాప చనిపోవడంతో భయాందోళనకు గురైన మహిళ.. అత్తామామలకు ఫోన్ చేసి హర్షిత నాడీ కొట్టుకోవడం లేదని తెలిపింది. అనంతరం చనిపోయిందని చెప్పింది. ఎక్కడ ఉన్నావని వారు ప్రశ్నించగా సదరు మహిళ పొంతన లేని సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం గాలిస్తుండగా చుట్టుగుంట సమీపంలో చనిపోయిన పాపతో మహిళ, వంశీ కనిపించారు. వాళ్లిద్దర్నీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతోనే పాపను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, నిందితుడు వంశీపై గతంలో పోక్సో కేసు నమోదైందని.. ఈ కేసులో అతను రెండు నెలలు జైల్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతనిపై మరిన్ని కేసులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.