అమరావతి: ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా విజయానంద్ పనిచేశారు. సుదీర్ఘ కాలం పాటు ఆ పదవిలో ఉన్న విజయానంద్.. ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా అమలు చేసి ప్రత్యేక గుర్తింపు సాధించారు.
అయితే, ఐదేండ్ల కన్నా ఎక్కువ కాలం పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పని చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. దాంతో విజయానంద్‌ను ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఆ పదవి నుంచి తప్పించింది. విజయానంద్ స్థానంలో కొత్తగా ముఖేశ్ కుమార్ మీనాను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమించారు. ఈ క్రమంలో కొంతకాలంగా వెయిటింగ్లో ఉన్న విజయానంద్‌కు ఇప్పుడు ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇంధన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయిలో విజయానంద్ నియమితులు కావడం పట్ల ఇంధన శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.