Srisailam | శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ శాలను సోమవారం పశు వైద్య నిపుణులు పరిశీలించారు. ఆత్మకూరు ఏరియా పశు వైద్యశాల ఇన్చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఈ అరుణ, వెలుగోడు ఏరియా పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సీ ధనుంజయ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు డాక్టర్ ఎం రాం సింగ్ (సున్నిపెంట), డాక్టర్ కే అశోక్ కుమార్ (దుద్యాల), డాక్టర్ బీ భువనేశ్వరి (కొత్తపల్లి), బీ మురళీక్రుష్ణ (జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సున్నిపెంట) తదితరులు దేవస్థానం గో సంరక్షణశాలను సందర్శించారు.
గోసంరక్షణ శాలలోని గోవులకు పశు వైద్య నిపుణులు తగు వైద్య పరీక్షలు చేశారు. గోవులకు పౌష్టికాహారం పంపిణీ, సీజనల్ వ్యాధులను నిరోధించడానికి ముందస్తుగా గోవులకు వేయాల్సిన టీకా మందులు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.
ఇప్పటికే గోవులకు పౌష్టికాహారం పంపిణీలో భాగంగా దాణా, పచ్చగడ్డి, ఎండుగడ్డి తదితరాలు అందిస్తున్నారు. గోవుల్లో వచ్చే సీజనల్ వ్యాధులైన గొంతువాపు వ్యాధి, జబ్బ వ్యాధులు రాకుండా హెచ్ఎస్బీ క్యూ టీకాలు వేస్తున్నారు. గత నెల 25, 26 తేదీల్లో కూడా గోవులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గో సంరక్షణ శాఖ సహాయ కార్యనిర్వహణాధికారి ఏకే ధనపాల్, గో సంరక్షణశాల పర్యవేక్షకులు బీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం దేవస్థానం పరిధిలోని హేమారెడ్డి మల్లమ్మ మందిరం ఎదురుగా చేపట్టిన సప్త గోకులం, గణేశ సదనం, ధర్మకాట, శ్రీశైల ప్రాజెక్టు కాలనీలో వసతి గృహాల నిర్మాణ పనులను ఈఓ లవన్న ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులు పరిశీలించారు. సంబంధిత ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి లవన్న ఆయా పనుల పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద సుమారు 40 అడుగుల విస్తీర్ణంలో సర్కిల్‌గా సప్త గోకులం నిర్మిస్తున్నారు. ఈ సప్త గోకులం నిర్మాణానికి దాతలు సహకారం అందిస్తున్నారు.
గోవులు సులభంగా మేత మేయడానికి, నీరు తాగడానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఈఓ లవన్న ఆదేశాలు జారీ చేశారు. గోవును సౌకర్యవంతంగా భక్తులు పూజించేలా సప్త గోకులాన్ని తీర్చి దిద్దాలని చెప్పారు.
సప్త గోకులం చుట్టూ కూడా పచ్చిక బయలు (ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్) ఏర్పాటు చేయాలని ఉద్యానవన విభాగం అధికారులను ఈవో లవన్న ఆదేశించారు. సప్త గోకుల పరిసరాల్లో దేవతా వృక్షాలను, సుందరీకరణ మొక్కలు పెంచడానికి చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు కూర్చోవడానికి వీలుగా సప్త గోకులం పరిసర ప్రాంతాల్లో సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.
గణేశ సదనంలోని ఆయా బ్లాకుల్లో గల గదులను ఈవో లవన్న పరిశీలించారు. అక్కడ ఉద్యానవన పనులు కూడా పరిశీలించారు. గణేశ సదనం ప్రాంగణంలో మరింత విస్తీర్ణంలో పచ్చిక బయళ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న కౌంటర్లు, కార్యాలయ ప్రదేశం, రెస్టారెంట్ కూడా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.
అటుపై నక్షత్ర వనంలో ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఈఓ లవన్న పరిశీలించారు. గణేశ సదనానికి సమీపంలోనే నక్షత్ర వనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రహరీ గోడ నిర్మాణం వేగవంతం చేయాలని సిబ్బందిని ఈఓ లవన్న ఆదేశించారు. ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కాగానే నక్షత్ర వనంలో మొక్కలు నాటాలన్నారు. ఈ మొక్కలు క్రమ పద్దతిలో నాటాలన్నారు.
అటుపై భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో టూరిస్ట్ డార్మెటరీలకు ఎదురుగా నిర్మిస్తున్న ధర్మ కాటను ఈఓ లవన్న పరిశీలించారు. దర్మకాట పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బంది ఆదేశించారు.
శ్రీశైలం ప్రాజెక్టులో నిర్మిస్తున్న సిబ్బంది గృహాలను ఈఓ లవన్న పరిశీలించారు. మూడు నమూనాల్లో 1-బీహెచ్‌కే స్మాల్, 1-బీహెచ్‌కే బిగ్, 2-బీహెచ్‌కే బిగ్ పేర్లతో శ్రీశైల దేవస్థానం వీటిని నిర్మిస్తున్నది. 1- బీహెచ్‌కే స్మాల్ విభాగంలో 108, 1-బీహెచ్‌కే బిగ్ లో 104, 2-బీహెచ్‌కే బిగ్ లో 81 ఇండ్లతో కలిపి మొత్తం 293 ఇండ్లు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఈఓ లవన్న మాట్లాడుతూ ఈ ఇండ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో పూర్తిగా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ వసతి గృహాల నిర్మాణం పూర్తి కాగానే సున్నిపెంటకు దేవస్థానం సిబ్బందిని తరలిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వీ రామకృష్ణ, మురళీధర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీ చంద్రశేఖర శాస్త్రి, నీటి సరఫరా విభాగం అసిస్టెంట్ ఇంజినీర్ రాజేశ్వరరావు, సివిల్ విభాగం అసిస్టెంట్ ఇంజినీర్లు భవన్ కుమార్, ప్రణయ్, రాజారావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.