మంగళగిరి: కష్టపడి చదివి ఉన్నతంగా ఎదిగినవారు, తాము పెంచుకున్న సంపదను సమాజంతో పంచుకున్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తమ సంపదను మాతృభూమి అభివృద్ధి కోసం వెచ్చించడంలో ఏమాత్రం సంకోచించకూడదని పిలుపునిచ్చారు. మంగళవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో డాక్టర్ రామినేని ఫౌండషన్– అమెరికా ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు.. చదువులో ప్రతిభ కనబర్చిన పలువురు విద్యార్థులకు రామినేని పురస్కారాలను అందించి అభినందించారు.
సొంతలాభం కొంత మానుకుని.. పొరుగువానికి తోడు పడవోయ్ అన్న గురజాడ మాటలను స్వర్గీయ రామినేని అయ్యన్న చౌదరి తు.చ తప్పక ఆచరించి చూపారని వెంకయ్యనాయుడు కొనియాడారు. గణిత శాస్త్రంలో పట్టభద్రుడై అమెరికా వెళ్ళి, అక్కడ ఆర్థిక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి, ప్రొఫెసర్గా పని చేస్తూనే వ్యాపార రంగంలోకి దిగి అత్యున్నత స్థాయికి ఎదిగిన రామినేని జీవితాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు, యువతకు సూచించారు. ఎదిగిన చోటనే ఆగిపోకుండా, మాతృభూమికి ఏదైనా చేయాలనే తలంపుతో అమెరికాలో రామినేని ఫౌండేషన్ స్థాపించి, సేవా మార్గానికి అంకితం కావడం అభినందించదగిన విషయమన్నారు.
హఠాత్తుగా ఏర్పడిన పరిణామాల కారణంగా సాంకేతికత అంతరాలు స్పష్టంగా కనిపించాయని, గ్రామాలు-పట్టణాల మధ్యలో ఉన్న ఈ అంతరాన్ని తగ్గించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలని వెంకయ్యనాయుడు చెప్పారు. ఓవైపు మహమ్మారిని ఎదిరిస్తూనే విద్యార్థులకు చదువు చెప్పేందుకు శ్రమించిన ఉపాధ్యాయులను గౌరవించుకోవడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి హెన్రీ క్రిష్టినా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా, శాసనమండలి మాజీ సభ్యుడు సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ రామినేని ధర్మప్రచారక్, సంస్థ కన్వీనర్ పాతూరి నాగభూషణంతోపాటు ఫౌండేషన్ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.