తిరుపతి: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. శుక్రవారం సాయంత్రం వైఎస్ జగన్ తిరుపతి చేరుకుంటారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలి నడకన తిరుమల వెళ్లాలనుకున్నప్పటికీ.. గాయం తిరగబెట్టడంతో ఆయన రోడ్డు మార్గం ద్వారా ఏడుకొండలవారి సన్నిధికి చేరుకుంటారు. కాగా, జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు తిరుపతి జిల్లాలో 30 యాక్ట్ విధించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించారు.
జగన్ తిరుమలకు వస్తుండటంతో వైసీపీ, కూటమి నేతలకు ముందస్తుగా నోటీసులు జారీచేస్తున్నారు. కడప, అన్నమయ్య, నెల్లూరు, చిత్తురూ జిల్లాల నుంచి వైసీపీ కార్యకర్తలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వదిలిపెడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు.తిరుమల పర్యటనలో జగన్కు వెయ్యి మంది పోలీసులకు భద్రతను పటిష్టం చేశారు. కాగా, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ తిరుమలలో అడుగుపెట్టాలని బీజేపీ, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనట్లయితే జగన్ను అలిపిరి వద్ద అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతిలో బీజేపీ, హిందూ సంఘాల నేతలు సమావేశం కానున్నారు.