తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామి వారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు అర్చకులు స్నానం చేయించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారణు శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరహస్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి పుష్కరిణిలో స్నపన తిరుమంజన, చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు.
వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే ఉత్తరద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ సుబ్రమణ్యస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిచ్చారు.
విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.